అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని ఎదుర్కోండి: కేబినెట్ సమావేశంలో మంత్రులకు చంద్రబాబు పలు సూచనలు
- మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ విమర్శలను ఖండించిన చంద్రబాబు
- సింగపూర్ మరెవరికీ ఇవ్వని అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని వెల్లడి
- అమరావతిలోని భవనాలను ప్రపంచ స్థాయిలో నిర్మిస్తున్నామన్న సీఎం
- ఏఐ, ఐటీపై మంత్రులు అవగాహన పెంచుకోవాలని సూచన
- జలధార, జల హారతి, సూర్యఘర్ లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని ఆదేశం
ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మంత్రులకు ఆయన పలు సూచనలు చేశారు. ముఖ్యంగా మంత్రుల సింగపూర్ పర్యటన, అభివృద్ధి పనులపై ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను తిప్పికొట్టాలని సూచించారు.
మంత్రుల సింగపూర్ పర్యటనపై వైసీపీ చేస్తున్న విమర్శలను సీఎం తీవ్రంగా ఖండించారు. సింగపూర్ ప్రభుత్వం మరెవరికీ ఇవ్వని అరుదైన అవకాశాన్ని ఏపీకి ఇచ్చిందని, దీనిని రాజకీయం చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పాలనలో మెళకువలు, సంపద సృష్టి కోసం జరిగిన ఈ పర్యటనను ప్రజలకు వివరించాలని మంత్రులకు సూచించారు. "మనం ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చుతో, అత్యాధునిక టెక్నాలజీతో నిర్మాణాలు చేస్తున్నాం" అని స్పష్టం చేస్తూ, రాజధాని అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని దీటుగా ఎదుర్కోవాలని ఆదేశించారు.
అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు వంటి భవనాలను ప్రపంచస్థాయి కట్టడాలుగా నిర్మిస్తున్నామని, ఇవి రాష్ట్రానికి గర్వకారణంగా మారుతాయని సీఎం తెలిపారు. ధరల విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను వాస్తవాలతో సహా తిప్పికొట్టాలని సూచించారు. ఇంధన కొరత వంటి సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సాధారణ స్థితికి తెచ్చిందని గుర్తు చేశారు.
రాష్ట్ర పాలనలో ఏఐ, ఐటీ వినియోగాన్ని పెంచాలని... మంత్రులు కూడా ఈ అంశాలపై అవగాహన పెంచుకోవాలని చంద్రబాబు సూచించారు. ఉద్యోగుల నియామకాల్లో కూడా ఏఐ పరిజ్ఞానాన్ని తప్పనిసరి చేయాలనే ఆలోచనను పంచుకున్నారు.
కేవలం రాజకీయాలే కాకుండా, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండల దృష్ట్యా ప్రజలు ఇబ్బంది పడకుండా తాగునీరు, ముందస్తు జాగ్రత్తలపై దృష్టి సారించాలని మంత్రులను ఆదేశించారు. జలధార, జల హారతి, సూర్యఘర్ (ఇళ్లపై సోలార్) వంటి కార్యక్రమాల లక్ష్యాలను వేగంగా చేరుకోవాలని సూచించారు.